కశ్యపప్రజాపతి
కుమారుడు విభాండకుడు. ఇతడు బ్రహ్మచర్యానిష్ఠాగరిష్ఠుడు. ఒకనాడు విభాండకుడు స్నానం చేస్తూ అపురూప సౌందర్యవతి అయిన ఊర్వశిని చూసాడు.
అతని మనస్సు చలించగా, ఆ నదిలోనే రేత్ణపతనమైంది.
ఆ నదిలో నీళ్ళు త్రాగుతూ
ఓ మృగం ఆ రేతస్సును
మ్రింగి, గర్భం ధరించి ఒక
మగ శిశువును కంది. విభాండకుడు ఆ
శిశువును తన ఆశ్రమానికి తెచ్చి,
ఋష్యశృంగుడు అని నామకరణం చేసి
అల్లారుముద్దుగా పెంచు తున్నాడు. విభాండకుడు
తన కుమారుని ఆశ్రమ పరిసరాలు దాటనివ్వకుండా,
నియమ, నిష్ఠలతో పెంచుతూ వేదవేదాంగవిదుని చేసాడు. ఋష్యశృంగునికి ఆ అరణ్యంలోని చెట్లు,
చేమలు, పక్షులు, జంతువులు తప్ప మరేమీ తెలియదు.
అతనికి స్త్రీ, పుంభావ భేదం లేదు.తన
తండ్రిని,ఆశ్రమాన్ని, అరణ్య పరిసరాలను తప్ప
మరేమీ ఎరుగని ఋష్యశృంగుడు నిత్యాగ్నిహోత్రియై లోకప్రసిద్ధములైన వ్రతిత్త్వము, ప్రాజాపత్యములనే బ్రహ్మచర్యములను పాటిస్తూ, పితృసేవ చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఆ రోజులలో
అంగరాజ్యాధిపతియైన రోమపాదుడు అధర్మపరుడై ధర్మచ్యుతికి పాల్పడడంవల్ల ఆ దేశానికి అనావృష్టి
సంక్షోభం చుట్టుముట్టింది. దేశప్రజలందరూ తినడానికి తిండిలేక ఆకలి దప్పులతో అలమటిస్తూంటే
చూడలేక, రోమపాదుడు తన మంత్రులనూ, పండిత, పురోహితులనూ సమావేశపరచి వారితో ‘‘ బ్రహ్మవేత్తలారా! మీరు సర్వఙ్ఞులు. సమస్తధర్మాలూ,
లోకాచారాలూ తెలిసినవారు. నా దేశాన్ని పట్టి
పీడిస్తున్న ఈ అనావృష్టికి కారణం
నేను చేసిన పాపాలే అని అర్ధం అయింది.
ఆ పాపాన్ని తొలగించుకోవడానికి నేనేం చెయ్యాలో ఉపదేశించి
నన్ను, నా ప్రజలనూ, నా
దేశాన్ని కాపాడండి’’ అని ప్రార్ధించాడు. అప్పుడు వారు:
‘‘ మహారాజా! అఖండ బ్రహ్మచర్యదీక్షావ్రతుడు, మహాశక్తిసంపన్నుడైన ఋశ్యశృంగుని మన
రాజ్యానికి ఆహ్వానించి, మీ కుమార్తె అయిన శాంతను అతనికిచ్చి వివాహం జరిపించండి. ఋష్యశృంగుని పాదస్పర్శతో మీ పాపం ప్రక్షాళనమై,
అనావృష్టి పీడ తొలగి, ప్రజలంతా
సుఖ శాంతులు పొందగలరు. అయితే, విభాండకమహర్షి ఆశయానికి విరుద్ధంగా ఋష్యశృంగుని మన రాజ్యానికి తీసుకురాగలిగే
ధైర్యం మాకు లేదు. కానీ
ఇందుకు మార్గాంతరం వుంది.
ఋష్యశృంగునకు
తపస్సు, స్వాధ్యాయనము, వనవాస జీవితము తప్ప
మరేమీ తెలియవు. ముఖ్యంగా స్రీలను చూసిగానీ, విషయవాంఛలను అనుభవించిగానీ ఎరుగడు. కనుక, వయో, రూప,
లావణ్య, విద్యాచతురులైన వారాంగలను ఈ కార్యానికి నియోగించితే
వారు తమ సౌందర్యంతో ఋష్యశృంగుని ఆకర్షించి మన రాజ్యానికి తీసుకుని
రాగలరు’’ అని సలహా ఇచ్చారు.
రోమపాదుడు వారి సలహాను అమలు
చేయించాడు. సర్వాంగ సౌందర్యనిధులైన వారకాంతలు ఋష్యశృంగుని ఆశ్రమానికి సమీపంలో నివాసం ఏర్పరచుకుని, తగిన సమయం కోసం
ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నారు. అరణ్య
జీవనమేగానీ, నాగరిక జీవనం ఎరుగని ఋష్యశృంగుడు,
ఒకరోజు ఆ వారకాంతలను చూసాడు.
సౌదర్యశోభితులైన ఆ వారకాంతలు మధురగానం
చేస్తూ, ఒయ్యారాలు ఒలకబోస్తూ, నర్తిస్తూ కనిపించారు. ఋష్యశృంగుని మనస్సులో ఏదో తెలియని చిన్న
కదలిక అలలా కదిలింది. గుండె లయతప్పింది. అది
గమనించిన ఆ వారకాంతలు చిరునవ్వుల
పువ్వులు జల్లుతూ ఋష్యశృంగుని సమీపించి: ‘‘ ఓ బ్రాహ్మణోత్తమా! నీవెవరు?
నీ జీవన విధానమేమిటి? జనశూన్యమైన
ఈ ఘోరారణ్యంలో ఏల ఒంటరిగా సంచరిస్తున్నావు?
’’ అని ప్రశ్నించారు. ‘‘నేను విభాండకమహర్షి కుమారుడను.
నా పేరు ఋశ్యశృంగుడు. మీరంతా
నా ఆశ్రమానికి వచ్చి నా ఆతిథ్యం
స్వీకరించి నన్ను కృతార్ధుణ్ణి చెయ్యాలి’’
అని అర్దించాడు. ఆ వారకాంతలు అతని
ఆశ్రమానికి వెళ్ళి, అతని ఆతిథ్యం స్వీకరించి,
ప్రతిసత్కారం అంటూ అతనిని కౌగలించుకుంటూ,
తమతో తెచ్చిన మధుర పదార్ధాలను, వింత
ఫలాలను అతనికి అందచేసి ఆ నెరజాణలు అతని
వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.
వారు వెళ్ళిన దగ్గరనుంచీ ఋశ్యశృంగుని మనస్సు మనస్సులో లేదు. ఆవేదనతో ఆ
రాత్రంతా నిద్రలేకుండా గడిపాడు. మరునాడు త్వరత్వరగా అడుగులు వేస్తూ ఆ వారకాంతల నివాసం
చేరాడు. అతని కోసమే ఎదురుచూస్తున్న
ఆ వారకాంతలు, ఋశ్యశృంగుని కౌగిలించుకుని ‘‘స్వామీ! మీ రాకకోసమే ఎదురు
చూస్తున్నాం. మీరు కోరగానే మీరిచ్చిన
అతిథి సత్కారం అందుకున్నాం. అలాగే మీరుకూడా మా
ఆశ్రమానికి వచ్చి, మా ఆతిథ్యం సీకరించాలి’’
అని కోరారు. ఋశ్యశృంగుడు వారి అభ్యర్ధనను చిరునవ్వుతో
అంగీకరించి వారిని అనుసరించాడు.
ఆ వారకాంతలు తీయతీయని మాటలతో అతనిని కవ్విస్తూ, ‘‘ఇక్కడే మా ఆశ్రమం’’ అంటూ
ఋశ్యశృంగుని అంగరాజ్యం తీసుకువచ్చారు. ఋశ్యశృంగుడు అంగరాజ్యంలో ప్రవేశించగానే, ఆకాశం కారుమేఘావృతమై, కుండపోతగా
వర్షం కురవడం ప్రారంబించింది. సంతృప్తిచెందిన రోమపాదుడు, ఋశ్యశృంగునికి స్వాగతమర్యాదలు జరిపి, అతిథి సత్కారాలు చేసి
‘‘మహాత్మా! ప్రజాక్షేమం కోసం మిమ్ములను ఈ
విధంగా తీసుకునివచ్చినందుకు క్షమించండి. మీ రాకతో నా
రాజ్యం సుభిక్షమైంది.’’ అని తన కుమార్తె
శాంతను అతని చూపిస్తూ ‘‘ ఈమె
నా కుమార్తె శాంత. పరమప్రశాంత చిత్త.
ఈమెను తమ భార్యగా స్వీకరించి
నా వంశాన్ని తరింపచేయండి’’ అని అర్ధించాడు. ఋశ్యశృంగుడు
చిరునవ్వుతో అంగీకరించాడు. విభాండకుడు వారి వివాహానికి అంగీకరించాడు.
శాంత, ఋశ్యశృంగుల వివాహం రంగరంగ వైభవంగా జరిగింది.